ఏలూరు/పోలవరం/మంగళగిరి, డిసెంబర్ 22: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పదవి–బాధ్యత సమావేశంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జనసేన పార్టీ కూటమిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3,459 నామినేటెడ్ పదవులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచే క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసి, నిస్వార్థంగా సేవలందించిన కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తగిన గుర్తింపు ఇస్తున్నారని అన్నారు. సిఫార్సులు, ఒత్తిళ్లకు తావులేకుండా పూర్తిగా ప్రతిభ, అంకితభావం ఆధారంగా పదవులు కేటాయించడం జనసేన ప్రత్యేకతగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
కార్యకర్తలే పార్టీ బలం అనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని మరింత బలోపేతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగితే జనసేన మరింత ప్రజాదరణ పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డ మనగు రవికుమార్, కొయ్యలగూడెం సొసైటీ ప్రెసిడెంట్ దుగ్గిన శ్రీనివాస్, దర్భగూడెం సొసైటీ ప్రెసిడెంట్ అక్కిసెట్టి విజయప్రసాద్, జీలుగుమిల్లి సొసైటీ ప్రెసిడెంట్ సరిపెల్లి సత్యనారాయణ రాజు, కోన కుమార్ బాబు తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.
















Social Plugin