చింతలపూడిలో ఘనంగా యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు


ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో విశేష సందడి


ఏలూరు జిల్లా, చింతలపూడి: చింతలపూడి పట్టణంలో శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో యునైటెడ్ చింతలపూడి క్రిస్మస్–2025 వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. మండల, పట్టణ పరిధిలోని అన్ని క్రైస్తవ సంఘాలకు చెందిన ఫాదర్లు, పాస్టర్లు, సంఘ కాపరులు, విశ్వాసులు, అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

వేడుకలలో భాగంగా చింతలపూడి ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ర్యాలీగా కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారులు క్రిస్మస్ తాత వేషధారణలో, మహిళలు శాంతాక్లాస్ క్యాప్స్ ధరించి ఆకట్టుకున్నారు. క్రిస్మస్ క్యారల్స్, ఆధ్యాత్మిక గీతాలతో ర్యాలీ పట్టణ వీధుల్లో ఉత్సాహంగా కొనసాగింది.

అనంతరం మినీ బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వేదికపై ప్రధాన కార్యక్రమం జరిగింది. అతిథుల సమక్షంలో క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించి, కొవ్వొత్తులు వెలిగించారు. కేక్ కటింగ్ అనంతరం ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ సందర్భంగా ఫాదర్లు, సంఘ కాపరులు ప్రజలను ఉద్దేశించి క్రిస్మస్ సందేశాలు అందించారు. మేడం విజయ కూడా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ, క్రీస్తు పుట్టుక మానవాళికి రక్షణ సూచిక అని, త్యాగం, వినయం, ప్రేమతో కూడిన ఆయన జీవితం సర్వ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ ఐక్య క్రిస్మస్ వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

చిన్నారుల నృత్యాలు, సంగీత నాదాలు ప్రేక్షకులను ఆధ్యంతం అలరించాయి. ఈ కార్యక్రమంలో ఫాదర్లు, సంఘ కాపరులు, విశ్వాసులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.