ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం: మండల పరిధిలోని వ్యవసాయ పొలాలు ముంపు బారిన పడకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాంతంలో వరద నీటి పారుదల కోసం తూరలు ఏర్పాటు చేయాలని రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. పొంగుటూరు–కన్నాయిగూడెం గ్రామాల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేలో స్మాల్ వెహికల్ అండర్‌పాస్ (ఎస్‌వీయూపీ) వంతెన నిర్మాణం చేపట్టినప్పటికీ, వరదల సమయంలో నీరు సరిగా పారేలా ఏర్పాట్లు చేయలేదని రైతులు ఆరోపించారు.
హైవే నిర్మాణం వల్ల ఇరువైపులా నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి, వర్షాలు కురిసినప్పుడు లేదా వరదలు వచ్చినప్పుడు ఎగువ ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలు పూర్తిగా ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్‌కు గ్రీవెన్స్ ద్వారా రెండు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని రైతులు తెలిపారు.
అలాగే పొంగుటూరు, కన్నాయిగూడెం, యాదవోలు రోడ్డు కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కారణంగా అధ్వాన స్థితికి చేరిందని పేర్కొన్నారు. ఈ రోడ్డును సరిచేస్తామని హైవే నిర్వాహకులు హామీ ఇచ్చి అనంతరం నిర్లక్ష్యం వహించారని రైతులు, స్థానిక ప్రజలు ఆరోపించారు.
తక్షణమే వరద నీటి పారుదల కోసం తూరలు ఏర్పాటు చేసి, రోడ్ల సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.















Social Plugin