నిడమర్రులో విజిబుల్ పోలీసింగ్: ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు – మద్యం సేవించి డ్రైవింగ్‌పై కేసులు


పశ్చిమ గోదావరి జిల్లా,టి.నిడమర్రు/ఏలూరు: జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు నిడమర్రు పరిధిలో పోలీసులు ‘విజిబుల్ పోలీసింగ్’తో పాటు వాహన తనిఖీలు నిర్వహించారు. నిడమర్రు ఇన్‌స్పెక్టర్ రజినీ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఎస్.ఎన్.వి.వి. రమేష్ మరియు సిబ్బంది ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.


ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేకుండా నడుపుతున్న 62 వాహనాలను గుర్తించి చట్టపరంగా జరిమానాలు విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేశారు. తనిఖీల సందర్భంగా ఒక లారీ, ఒక కారు, ఒక మినీ బస్సు, ఐదు మోటార్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు.

అదేవిధంగా రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఏడుగురు వ్యక్తులపై న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ముఖ్యంగా రాత్రి వేళల్లో మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఘోర ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. అటువంటి ఘటనలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మహిళలకు, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాల నివారణ, ప్రజల పరిరక్షణ కోసమే నిడమర్రు వ్యాప్తంగా ఈ విజిబుల్ పోలీసింగ్ తనిఖీలు కొనసాగుతాయని నిడమర్రు ఎస్ఐ తెలిపారు.