ఏలూరు జిల్లా, భీమడోలు: భీమడోలు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మంచి స్నేహితులు కాగా, శుభకార్యాలకు ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనిలో భాగంగా ఎప్పుడూ కలిసి వెళ్లే వీరు శనివారం తెల్లవారుజామున పూల డెకరేషన్‌కు అవసరమైన పుష్పాలు తీసుకువచ్చేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, ఏలూరు నుంచి పొలసానిపల్లి వైపు బైక్‌పై వస్తున్న సమయంలో భీమడోలు ఫ్లైఓవర్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్వారకాతిరుమల మండలం తిమ్మపురానికి చెందిన మాండ్రోజు చరణ్‌కుమార్ (26), ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన సయ్యద్ రఫీ (22), కొయ్యగర శ్రీరాములు అలియాస్ బన్నీ (21) మృతి చెందారు.
ఘటనాస్థలంలో నెత్తుటి మడుగులో పడి ఉన్న తమ బిడ్డలను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్‌ఐ ఎస్‌కే మదీనా బాషా సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు, ద్వారకాతిరుమలలో ఆదివారం జరగనున్న ఓ ఫంక్షన్‌కు డెకరేషన్ కోసం పూలు కొనుగోలు చేసేందుకు చరణ్‌కుమార్ తన తమ్ముడి కొత్త బైక్‌పై రఫీ, బన్నీతో కలిసి శుక్రవారం రాత్రి బయలుదేరాడు. ఏలూరులో పూల ఆర్డర్ ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో దట్టమైన పొగమంచు కురుస్తుండటం కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమడోలు సీఐ తెలిపారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.















Social Plugin