సెమీ క్రిస్మస్ వేడుకల్లో శాంతి, ప్రేమ, ఐక్యత సందేశం– జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, డిసెంబరు 23: ఏసుక్రీస్తు బోధించిన శాంతి, ప్రేమ, దయ, ఐక్యత విలువలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరణీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు, హైటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీతో కలిసి కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులు, చిన్నారులకు పంచారు. క్యాండిల్ వెలిగించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంటాక్లాజ్ వేషధారణలో చిన్నారులు ఆకట్టుకునేలా సందడి చేశారు.


కార్యక్రమంలో పాల్గొన్న బిషపులు, పాస్టర్లు క్రీస్తు జన్మ విశిష్టత, ఆయన బోధనలు, క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యతపై ప్రసంగించారు. గ్రంథ పఠనం, ప్రార్థనలు, గీతాల ఆలాపనతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. అధికారులకు ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ, క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి మార్గదర్శకమని, సమాజంలో శాంతియుత సహజీవనానికి ఇవి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ, క్రైస్తవ సోదరుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. క్రిస్మస్ పండుగతో ప్రతి ఇంటా శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం. అచ్యుత అంబరీష్, జిల్లా సెట్‌వెల్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఇన్‌చార్జి సహాయ సంచాలకులు కె.ఎస్. ప్రభాకర రావు, వివిధ శాఖల అధికారులు, బిషపులు, పాస్టర్లు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి