ఏలూరు, డిసెంబర్ 23: పేద ప్రజలకు అందించే వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించబోమని, విధుల పట్ల అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ సౌరబ్ గౌర్ హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వితో కలిసి మంగళవారం రాత్రి ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సౌరబ్ గౌర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సేవలపై స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఆ స్థాయిలోనే వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి సంతృప్తితో సేవలు పొందించి ఇంటికి వెళ్లే పరిస్థితి తప్పనిసరిగా కలగాలని, అదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, అలసత్వం వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతుందని, ఇది సహించరాని నేరమని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రోగులకు అందుతున్న సేవలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఆసుపత్రి సేవలపై రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే ఆసుపత్రి పరిసరాలు పూర్తిగా పరిశుభ్రంగా ఉండాలని, ఎక్కడా అపరిశుభ్ర పరిస్థితులు ఉండకూడదన్నారు. ప్రసూతి, చిన్నపిల్లల, క్యాజువాలిటీ వార్డులను పరిశీలించి అక్కడ అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై కూడా వివరాలు సేకరించారు.
ప్రసూతి, లేబర్ వార్డుల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం టాయిలెట్లు, డ్రగ్ స్టోర్‌ను పరిశీలించి, శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి.జె. అమృతం, ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డా. పాల్ సతీష్, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.















Social Plugin