తోటి వారితో ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్ పండుగ : ఎస్ఎంఆర్ పెదబాబు


ఏలూరు, డిసెంబర్ 23 : తోటి వారితో ప్రేమ, దయ, కరుణ, క్షమాగుణం కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్ పండుగ అని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు.


స్థానిక 50వ డివిజన్ అరుంధతి కాలనీలో పెదపూడి నాని ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా ఒకే రోజు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధించిన ప్రేమ, దయ, క్షమాగుణాలను తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు.

ప్రతి సంవత్సరం పాస్టర్ల ఆశీర్వాదాలు పొందడం కోసం అరుంధతి కాలనీలో జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటామని పేర్కొన్నారు. ప్రభువు దీవెనలతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు కలిసి ప్రజలకు మంచి పరిపాలన అందించే శక్తి కలగాలని ప్రార్థించారు.

కార్యక్రమం ప్రారంభంలో పెదపూడి నాని, ఎల్లమెల్లి ప్రతాప్, అరుంధతి కాలనీ వాసులు ఎస్ఎంఆర్ పెదబాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేయించి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ వేడుకల్లో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. పాస్టర్ బాబు జార్జ్ ఫాదర్, పాస్టర్ ఇమ్మానియేల్ ప్రార్థనలు చేసి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాసరావు, పాము శామ్యూల్, ఈదుపల్లి పవన్, స్థానిక నాయకులు మంత్రి మహాలక్ష్మి నాయుడు, గవరపేట నాయుడు తదితరులు పాల్గొన్నారు.