సెమీ క్రిస్మస్ వేడుకల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్—మరణించిన కుటుంబాలకు స్వీట్ కిట్లు పంపిణీ


ఏలూరు జిల్లా, దెందులూరు, డిసెంబర్‌ 23: దెందులూరు మండలం ఆర్‌.సి.యం వేగవరం విచారణ పరిధిలోని చల్లపల్లి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘస్తులు, విశ్వాసులకు ఆయన సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.


వేదికపై మాట్లాడుతూ, క్రీస్తు బోధించిన శాంతి, సన్మార్గాన్ని ఆచరిస్తూ పరులకు సేవ చేయాలన్నారు. గత ఏడాది క్రిస్మస్ నుంచి ఈ ఏడాది క్రిస్మస్ వరకు నియోజకవర్గంలో మరణించిన కుటుంబాల్లో పండుగలు జరపలేని పరిస్థితిని గుర్తుచేస్తూ, అలాంటి కుటుంబాలకు క్రిస్మస్, న్యూ ఇయర్‌, సంక్రాంతి సందర్భంగా తాను స్వయంగా స్వీట్ కిట్లు అందిస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చల్లపల్లి గ్రామంలో ఈ ఏడాది కాలంలో మరణించిన వారి కుటుంబాలకు సెమీ క్రిస్మస్ వేదికగా కేజీ అరిసెలు స్వీటు, అర్ధ కేజీ చెక్కల హాటు కలిగిన కిట్లను ఎమ్మెల్యే ప్రభాకర్ అందజేశారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి తాను కుటుంబ సభ్యుడిగా, పెద్దకొడుకుగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

అనంతరం ఫాదర్ బాల గారు సహా పలువురు గురువులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వదించారు. ఈ వేడుకలు సౌహార్ద వాతావరణంలో ఘనంగా ముగిశాయి.