ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలను స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
మంగళవారం రాజధాని సెక్రటేరియట్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడును కలిసిన చంటి, నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏలూరు నియోజకవర్గంలో ఖాళీ స్థలాలపై అధికంగా పన్నులు విధించడంతో స్థల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇళ్లకు సంబంధించి పన్నులు తక్కువగా ఉండగా, ఖాళీ స్థలాలకు ఎక్కువ పన్నులు విధించడం అన్యాయంగా మారిందన్నారు.
ఇళ్లకు విధించే పన్నుల మాదిరిగానే ఖాళీ స్థలాలకు కూడా తక్కువ పన్నులు విధిస్తే యజమానులు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేందుకు ముందుకు వస్తారని, దీని ద్వారా ప్రభుత్వానికి రెవెన్యూ కూడా పెరుగుతుందని ముఖ్యమంత్రికి వివరించారు.
అలాగే ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈడా (ELDA) మరియు రెవెన్యూ శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ అంశాన్ని కూడా తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తాను ఇప్పటివరకు అబ్జర్వర్‌గా పనిచేసిన కైకలూరు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత కోసం కృషి చేశానని చంటి తెలిపారు. ఇకపై జిల్లా అధ్యక్షునిగా జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ పట్ల ప్రజలకు మరింత విశ్వాసం పెంపొందించేలా పని చేస్తానని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.
నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ, తనపై ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకానికి పదింతలు ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పిన చంటి, తనకు ఇచ్చిన బాధ్యతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
















Social Plugin