ఇనుమూరు గిరిజనులపై దాడులు, నిర్భంధాలు, అక్రమ పోలీసు కేసులు ఆపాలి.


గిరిజన భూ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలి.
29న జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ముందు, 30న ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా, నిరసన కార్యక్రమాలు..
ఆదివాసి గిరిజన, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం..


ఏలూరు, బుట్టాయగూడెం, డిసెంబర్ 27: బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై దాడులు, నిర్భంధాలు, అక్రమ పోలీసు కేసులు ఆపాలని, గిరిజన భూ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని ఆదివాసి గిరిజన, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఇనుమూరు గిరిజనులకు అండగా ఈనెల 29న జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ముందు, 30న ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది.
 
శనివారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ అధ్యక్షతన ఇనుమూరు గిరిజనులకు న్యాయం కోసం ఆదివాసి గిరిజన, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
 
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి  ఎ.రవి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు, సిపిఐ జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, ఎం సిపిఐ (యు) జిల్లా కార్యదర్శి శావనంపూడి నాగరాజు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా నాయకులు కట్టా సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం  జిల్లా నాయకులు కారం భాస్కర్, ఇనుమూరు గిరిజన భూ బాధితులు పొట్టా రామదుర్గ, తెల్లం బాలాజీ, సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పంపన రవికుమార్ మాట్లాడారు.

బుట్టాయిగూడెం మండలానికి చెందిన ఇనుమూరులో ఉన్న 57 గిరిజన కుటుంబాలవారు ఉన్నారని, వీరి జీవనాధరం వ్యవసాయమేనని చెప్పారు. అంతర్వేదిగూడెం శివారు ఇనుమూరు గ్రామ రెవెన్యు పరిధిలో గల సర్వే నెంబర్ 221లో ఎ.3.34 సెంట్లు, 22355 2.8.74 2, 21055 2.6.67 2, 21755 2.7.52 2, 2135 2.9.50 , 214లో ఎ.7.00 సెంట్లు ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వ భూములను వీరి పూర్వికులు చదును చేసి, సాగులోనికి తెచ్చారని,తరతరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారని వివరించారు.


ఈ భూముల ద్వారానే జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఈ భూముల్లో 57 గిరిజన కుటుంబాలు బొబ్బర, మినుము, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారని చెప్పారు. గిరిజనుల స్వాధీన హక్కు భుక్తంలో అనుభవిస్తున్నారని గతంలో అసైన్ మెంట్ చేయమని గిరిజనులు అనేక సార్లు దరఖాస్తులు పెట్టుకున్నా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఈ నెల 24న గిరిజనేతర భూస్వాములకు అనుకూలంగా పోలీసులు, మండల రెవెన్యూ అధికారులు గిరిజనులు సాగు చేస్తున్న భూముల్ని దున్నించి, ధ్వంసం చేయడం దుర్మార్గం అని తీవ్రంగా ఖండించారు. వేలాది రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకువచ్చి పెట్టుబడి పెట్టిన  మొక్కజొన్న పంటను భూస్వాములు దౌర్జన్యంగా ధ్వంసం చేశారన్నారు. 

అడ్డువచ్చిన గిరిజనుల పై పోలీసులు, రెవెన్యూ అధికారులు విచక్షణారహితంగా దాడిచేసి కొట్టారని చెప్పారు. చివరికి గిరిజన మహిళలపై మగ పోలీసులే దాడులు చేయడం హేయమని అన్నారు. ఈ భూముల సమస్యపై  హైకోర్టులో కేసు నమోదై ఉన్నదని, ఏజెన్సీ భూ సమస్యలలో పోలీసులు జోక్యం చేసుకోకూడదని జీవో నెంబర్ 1049/28-7-2007 ఉన్నదని గుర్తు చేశారు. అయినా దానికి విరుద్ధంగా పోలీసులు ఏజెన్సీ భూసమస్యల్లో జోక్యం చేసుకుని గిరిజనులు, పేదలపై నిర్బంధాన్ని ప్రయోగించి దాడులు చేయడం తగదున్నారు. 

ఈ దాడులపై నిలదీస్తున్న గిరిజనులు, గిరిజన నాయకులపై తప్పుడు కేసులతో పాటు రౌడీ షీట్లు, పీడి యాక్ట్ సైతం బనాయిస్తామని భయపెట్టడం  అన్యాయం, అప్రజాస్వామికమన్నారు. బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామ గిరిజనులపై దాడులు, నిర్భంధాలు, అక్రమ పోలీసు కేసులు ఆపివేయాలని, తప్పుడు ప్రొటెక్షన్ ఆర్డర్లను నిలిపివేయాలని, తక్షణమే ఏజెన్సీ భూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై దాడికి పాల్పడ్డ వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు. ఇనుమూరు గిరిజనులకు న్యాయం చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్,వామపక్షాలు, ఆదివాసి గిరిజన, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.