కోర్టు మానిటరింగ్‌పై అదనపు ఎస్పీ సమావేశం – 41 కేసుల్లో 51 మందికి శిక్షలు


ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, 27 శుక్రవారం, ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు జిల్లా కోర్టు మానిటరింగ్ సెల్ (CMC) సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా అదనపు ఎస్పీ వివిధ న్యాయస్థానాలలో విచారణలో ఉన్న కేసుల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసుల్లో నిందితుల హాజరు, సాక్షుల హాజరు పరిస్థితులపై సమీక్ష నిర్వహించి, సకాలంలో సాక్షులను గౌరవ న్యాయస్థానాల ఎదుట హాజరు పరచేందుకు పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఏర్పాటు చేసిన కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులు ధర్మా యాప్ ద్వారా న్యాయ సహాయకుల సహకారంతో కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. కోర్టులో డిఫెన్స్ తరఫున అడిగే ప్రశ్నలకు సాక్షులు ఎలా స్పందించాలనే అంశంపై ముందస్తుగా అవగాహన కల్పించడం వల్ల కేసులలో శిక్షలు పడటంలో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు.

2024 నుంచి 2025 మధ్యకాలంలో కోర్టు మానిటరింగ్ సెల్ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 41 కేసుల్లో 51 మంది నిందితులకు గౌరవ న్యాయమూర్తులు శిక్షలు విధించారు. ఇది గతంతో పోలిస్తే 156 శాతం విజయంగా నమోదైంది.

విధించిన శిక్షల వివరాలు
ఏలూరు జిల్లాలో గౌరవ న్యాయమూర్తులు CMC సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా విధించిన శిక్షలు ఈ విధంగా ఉన్నాయి.
18 కేసుల్లో జీవిత ఖైదు శిక్షలు విధించగా, వాటిలో 3 కేసుల్లో ద్వంద్వ జీవిత ఖైదు శిక్షలు విధించారు.
3 కేసుల్లో ముగ్గురు నిందితులకు 20 సంవత్సరాల జైలు శిక్షలు,
9 కేసుల్లో 11 మందికి 10 సంవత్సరాల జైలు శిక్షలు,
3 కేసుల్లో 3 మందికి 7 సంవత్సరాల జైలు శిక్షలు,
4 కేసుల్లో 4 మందికి 5 సంవత్సరాల జైలు శిక్షలు,
1 కేసులో ఒక నిందితుడికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

ఈ సందర్భంగా 41 కేసుల్లో 156 శాతం శిక్షలు పడటానికి కృషి చేసిన కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులను జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు ప్రత్యేకంగా అభినందించారు.