ప్రపంచ పర్యాటక రంగానికి ఏపి గమ్యస్థానంగా మారుతుంది


రానున్న నాలుగేళ్లలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో మొదటి స్థానంలో నిలిచేలా కృషి.
ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మహర్దశ.
భవిష్యత్తు అంతా పర్యాటక రంగానిదే. 
అతిధి దేవోభవ అనే ప్రాచీన సూక్తి ఏపి రంగానికి  నిలువుటద్దంగా నిలబడుతుంది.
కేంద్రంతో చర్చించి ఏలూరు పట్టణానికి సంగీత, నృత్య కళాశాల మంజూరుకు కృషి చేస్తానని హామీ.
రూ 5.25 కోట్లతో ఏలూరు జిల్లా పురావస్తు మ్యూజియంను ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మంత్రి కందుల దుర్గేష్ ...


రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ( చంటి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ, ఏలూరు నగర మేయరు షేక్ నూర్జహాన్, విజయవాడ ఆర్టీసీ రీజినల్ -2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, రాష్ట్ర వడ్డీలు కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, అంబికా రాజా, చరిత్ర కారులు మరియు సామాజిక కార్యకర్త బి.కె.యస్.ఆర్. అయ్యంగార్   ప్రభృతులు పాల్గొన్నారు.

ఏలూరు, డిసెంబరు 16: ఏలూరు జిల్లా కేంద్రంలోని కోటదిబ్బ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రూ.5.25 కోట్ల నిధులతో నిర్మించిన జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.

ప్రారంభోత్సవం అనంతరం మంత్రి జిల్లా పురావస్తు మ్యూజియంలో ఏర్పాటు చేసిన డిజిటల్ బుక్ రూమ్, స్కల్ప్చర్ గ్యాలరీలను సందర్శించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డిజిటల్ బుక్‌లో ప్రతి పేజీని స్పర్శిస్తే ప్రత్యక్ష అనుభూతి కలగడం అద్భుతంగా ఉందని మంత్రి ఆసక్తిగా తిలకించారు.

అలాగే కాంస్య కళతో రూపొందించిన శ్రీరామ, లక్ష్మీనారాయణ, గరుడ, వైష్ణవ ఋషి, మావటి విగ్రహాలతో పాటు హిందూ, జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన బుద్ధుడు, జైన తీర్థంకరులు, విష్ణువు, వెంకటేశ్వరుడు, ఆల్వార్లు, శ్రీదేవి-భూదేవి, నటరాజ కాంస్య శిల్పాలను పరిశీలించారు. ప్రాచీన కాలానికి చెందిన ఆయుధాలు, కవచాలు, మృణ్మయ పాత్రలు, శిలాయుగపు పరికరాలు, తాళపత్ర గ్రంథాలు, తామ్ర శాసనాలు, పంచలోహ విగ్రహాలు, నాణేలు, ఖురాన్ చేతి ప్రతులు వంటి అరుదైన వస్తువులు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రాష్ట్ర పర్యాటక, కళా, సాంస్కృతిక రంగాల్లో వేగంగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు. హేలాపురిగా పేరుగాంచిన ఏలూరు ఘన చరిత్రను భావితరాలకు పరిచయం చేయడంలో ఈ మ్యూజియం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అంకురార్పణ చేసిన మ్యూజియాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పూర్తి చేయడం ఆనందకరమని మంత్రి పేర్కొన్నారు. దాదాపు 10 లక్షల సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాల వరకూ నాటి చరిత్రను ప్రతిబింబించే వస్తువులను మ్యూజియంలో భద్రపరచడం గొప్ప విషయమన్నారు.

పోలవరం సమీపంలోని రుద్రమకోట తవ్వకాల్లో లభించిన అరుదైన మట్టి బొమ్మలు, తాబేలు పూసలు మ్యూజియానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కళా, సాంస్కృతిక వైభవానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు.

ఏలూరుకు సంగీత, నృత్య కళాశాల మంజూరు కోసం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో చర్చించి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే మ్యూజియంలో మూడో అంతస్తు నిర్మాణానికి కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ, ఏలూరుకు ఉన్న ఘన చరిత్రను ఈ మ్యూజియం ద్వారా ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఏలూరు వాసిపై ఉందన్నారు. ఏలూరు జాతరకు వచ్చే భక్తులు, యాత్రికులు తప్పకుండా పురావస్తు మ్యూజియాన్ని సందర్శించాలని కోరారు.

ఏలూరు నగరపాలక సంస్థ మేయరు షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పాలకవర్గ సమయంలోనే ఈ అరుదైన పురావస్తు మ్యూజియం ప్రారంభం కావడం పూర్వజన్మ సుకృతమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, విద్యార్థులు మ్యూజియాన్ని సందర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎం. అచ్యుత్ అంబరీష్, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దబోయిన వాణిశివ ప్రసాదు, రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు, నగర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.