రాష్ట్రంలో మొదటిసారిగా 22A కేసుల పరిష్కారంపై ఏలూరులో ప్రత్యేక వేదిక


ఏలూరు, డిసెంబర్ 16: రాష్ట్రంలోనే తొలిసారిగా ఏలూరు జిల్లాలో 22A భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.


మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మెగా 22A భూ సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజలు, రైతుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. అందిన ఫిర్యాదులపై అక్కడికక్కడే పరిశీలన చేసి, పరిష్కార చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ రాజకీయ కక్షల కారణంగా రాష్ట్రంలో 22A భూ సమస్యలు తీవ్రంగా మారాయని విమర్శించారు. ప్రైవేట్ భూములను కూడా ఉద్దేశపూర్వకంగా 22A జాబితాలో చేర్చడంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ముఖ్యంగా గత ప్రభుత్వానికి అనుకూలంగా లేని వారి భూములను 22A, చుక్కల భూములుగా నమోదు చేశారని ఆరోపించారు.

ఈ సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తించి, రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు చర్యలు చేపట్టారని మంత్రి వెల్లడించారు. 22A కింద నమోదైన భూముల్లో జిరాయితీ భూములు ఉండటంతో భూ యజమానులు ఎన్నో సంవత్సరాలుగా భూములు విక్రయించలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లోనూ పొరపాటుగా 22A జాబితాలో చేరిన భూములను తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని 27 మండలాలకు చెందిన రైతులు, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును సవివరంగా పరిశీలించి, సుమారు 90 శాతం వరకు అదే రోజే పరిష్కారం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దేవాదాయ భూములు వంటి క్లిష్ట సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో ఒకటి లేదా రెండు వారాల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

22A భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, డీఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, డా. కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మెగా క్యాంప్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు తమ భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పించగా, తక్షణ పరిష్కార చర్యలపై వారు హర్షం వ్యక్తం చేశారు.