పోలవరం, డిసెంబర్ 23: రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని మోపే, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం మరియు వలసలను పెంచే వి.బి–జీ రాంజి (గారంటీ ఆఫ్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ – గ్రామీణ్) చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్), ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోలవరంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
రైతు కూలీ సంఘం (ఆం.ప్ర) రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా గంగాభవాని థియేటర్ నుంచి ఫారెస్ట్ ఆఫీస్, డివైఎస్పీ కార్యాలయం, బస్టాండ్ సెంటర్, దర్గా సెంటర్ మీదుగా ఏటిగట్టు సెంటర్ వరకు పెద్ద ఎత్తున నినాదాలతో ప్రదర్శన చేపట్టారు.
అనంతరం ఏటిగట్టు సెంటర్‌లో జరిగిన సభలో రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే విధంగా సవరణలు చేసి కొత్త చట్టంగా తీసుకురావడం తీవ్ర అన్యాయమన్నారు. ఈ చట్టం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గి, వలసలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం వాటా నిధులు సమకూర్చడంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో, కొత్త చట్టంలో 40 శాతం నిధులు భరించాలనడం పథకాన్ని నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్న ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో భూమిపై హక్కుల కోసం, భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర భూ సంస్కరణలు అవసరమని, అందుకోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజం రామారావు, జిల్లా నాయకులు సవలం రాంబాబు, మిడియం రవి దొర తదితరులు పాల్గొని నాయకత్వం వహించారు.















Social Plugin