ప్రగతి నావను మరింత వేగవంతం చేద్దాం – జిల్లా సమగ్రాభివృద్ధికి వినూత్న కార్యాచరణ అవసరం


ప్రతి కీలక సూచికలో ఏ+ లక్ష్యంగా ముందడుగు
– జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ


ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్‌ 30: గత ఏడాది కాలంలో సమష్టి కృషితో జిల్లాగా ఎన్నో కీలక విజయాలు సాధించామని, ఈ ప్రగతి పథాన్ని స్ఫూర్తిగా తీసుకుని సరైన విశ్లేషణతో వినూత్న ఆలోచనలు అమలు చేస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి మరింత ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మంగళవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్‌.ఎం.లతో కలిసి కీలక ప్రగతి సూచికలు (కేపీఐ), జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం గత ఏడాది చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు, సాధించిన విజయాలు, అలాగే కొత్త ఏడాది కార్యాచరణపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర దార్శనిక లక్ష్యాల సాధనలో భాగంగా సంక్షేమ పథకాల సమర్థ అమలుతో పాటు అన్ని రంగాల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించామని తెలిపారు. కేపీఐలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలవడం ఇందుకు నిదర్శనమన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రపంచ రికార్డులు, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయస్థాయి పురస్కారాలు, ఆకాంక్షిత బ్లాకుల అభివృద్ధి సూచికల్లో నీతి ఆయోగ్ బంగారు పతకాలు వంటి అనేక గుర్తింపులు జిల్లాకు దక్కాయని వివరించారు.

భారీ కార్యక్రమాలతో పాటు దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించి గౌరవ ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్నామని తెలిపారు. వీటిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త ఏడాదిలో జీడీడీపీ, జీవీఏ, తలసరి ఆదాయం వంటి ఆర్థిక సూచికల్లో కూడా లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ప్రతి సూచికలో ఏ+ లక్ష్యమే
ప్రతి కీలక ప్రగతి సూచికలో (కేపీఐ) ఏ+ గ్రేడ్ సాధించడమే జిల్లా లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. నవంబర్ వరకు గణాంకాల ప్రకారం ఎ.కొండూరు మండలం 129 సూచికల్లో 92 స్కోరుతో, నందిగామ 136 సూచికల్లో 90 స్కోరుతో, తిరువూరు 124 సూచికల్లో ఏ+ గ్రేడ్ సాధించాయని తెలిపారు. ప్రతి మండలం, ప్రతి సూచికలోనూ ఇదే స్థాయిని చేరుకోవాలని అధికారులకు సూచించారు.

వ్యవసాయ రుణాలు, ప్రకృతి సాగు విస్తీర్ణం, పంటల బీమా, ఉద్యాన పంటల సాగు, పశువుల షెడ్లు, పాడి అభివృద్ధి, ఎంఎస్ఎంఈల నమోదు, వసతి గృహాల్లో విద్యార్థుల నమోదు, రహదారుల నిర్మాణం–పునరుద్ధరణ, స్వచ్ఛత కార్యక్రమాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆరోగ్య పథకాల అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో సీపీవో వై. శ్రీలతతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.