ఎఫ్‌డీసీ జీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఎం. శ్రీనివాస నాయక్


ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్‌, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ – ఎఫ్‌డీసీ) జనరల్ మేనేజర్‌గా ఎం. శ్రీనివాస నాయక్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు జనరల్ మేనేజర్‌గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ నేపథ్యంలో ఆర్‌టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని ఎన్‌టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో ఉన్న ఎఫ్‌డీసీ కార్యాలయంలో శ్రీనివాస నాయక్ జీఎం హోదాలో బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో స్టెనోగ్రాఫర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, క్రమంగా వివిధ హోదాల్లో పని చేస్తూ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదగడం విశేషంగా పేర్కొనబడుతోంది.

జీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ, గౌరవ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు మరియు ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఇచ్చే సలహాలు, సూచనల మేరకు విధులు నిర్వర్తిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అలాగే చలనచిత్ర, టెలివిజన్‌, నాటక రంగాలకు చెందిన కళాకారుల సంక్షేమానికి అవసరమైన సేవలు అందించేందుకు తనవంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస నాయక్‌కు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్‌తో పాటు ఫిల్మ్‌, టెలివిజన్‌, నాటక రంగ ప్రముఖులు నాయుడు గోపి, రాందాసు నాయుడు, బాలు, సింగర కొండయ్య చౌదరి, మేనేజర్ చల్లా శ్రీనివాస్‌, కార్యాలయ సిబ్బంది తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.