ఏలూరు/పెరవలి: పెరవలి గ్రామంలో నిర్వహించిన అమర జీవి జలధారా వాటర్ గ్రిడ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌కు సంబంధించిన పలు కీలక సమస్యలపై వినతి పత్రాలను ఆయనకు సమర్పించారు.
వినతి పత్రాల్లో ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ZP రోడ్ల మరమ్మత్తులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు. జిల్లాలోని అనేక రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
అలాగే సత్యసాయి సమగ్ర రక్షిత తాగునీటి పథకం (Satya Sai CPWS)కు సంబంధించి గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న O&M బిల్లులు, వివిధ CPWS పథకాల విద్యుత్ చార్జీల రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా పరిషత్ పరిధిలోని Non-Provincialised పింఛను దారులకు ప్రస్తుతం జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచే పింఛన్లు చెల్లించాల్సి వస్తోందని, దీని వల్ల జిల్లా పరిషత్‌పై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. ఈ పింఛన్లను ప్రభుత్వం 010 పద్దు నుంచి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అక్టోబర్ 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న ZPTC సభ్యుల గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని కూడా వినతి పత్రంలో పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో ZPTC సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని, గౌరవ వేతనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి చెరువులకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఇన్లెట్, అవుట్‌లెట్ సదుపాయాలు కల్పించాలని కోరారు. ఫెన్సింగ్ లేకపోవడం వల్ల అక్రమ కార్యకలాపాలు, ప్రమాదకర మరణాలు చోటుచేసుకుంటున్నాయని, పశువులు నీటిలోకి వెళ్లి నీటిని కలుషితం చేస్తున్నాయని తెలిపారు.
వినతి పత్రాలను స్వీకరించిన డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, ఈ సమస్యలన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తెలిపారు.















Social Plugin