డిసెంబర్ 21 నుంచి 23 వరకు పల్స్ పోలియో కార్యక్రమం: ప్రతి చిన్నారికి చుక్కలు వేయాలి – జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, డిసెంబర్ 20: జిల్లాలో ఈ నెల 21 నుంచి 23 వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


జిల్లాలో ఐదు సంవత్సరాల లోపు మొత్తం 2 లక్షల 4 మంది చిన్నారులు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,49,470 మంది, పట్టణ ప్రాంతాల్లో 29,827 మంది, గిరిజన ప్రాంతాల్లో 20,707 మంది చిన్నారులు ఉన్నట్లు వివరించారు. ఈ చిన్నారులందరికీ సరిపడా వాక్సిన్ డోసులను ముందుగానే సిద్ధం చేసినట్లు తెలిపారు.

పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,707 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతంలో పోలియో చుక్కలు వేసేందుకు కేంద్రాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

డిసెంబర్ 21వ తేదీన 1,707 స్థిర కేంద్రాలతో పాటు 72 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా చిన్నారులకు పల్స్ పోలియో వాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేకంగా పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణికుల పిల్లలకు కూడా వాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు.

డిసెంబర్ 22 మరియు 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులను గుర్తించి, వారి ఇళ్ల వద్దే వాక్సిన్ అందించేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలోని ప్రతి చిన్నారి పల్స్ పోలియో కార్యక్రమంలో భాగస్వామి కావాలని ఆయన కోరారు.