ఏలూరు జిల్లా, ఏలూరు: స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో 17-12-2025 న బాలలకు సంబంధించిన వసతి గృహాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల సభ్యుల కోసం ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మిషన్ వాత్సల్య ఆధ్వర్యంలో, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్. సూర్యచక్రవేణి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్–2015, రూల్స్ 2022 ప్రకారం జిల్లాలో బాలల కోసం నిర్వహిస్తున్న అన్ని వసతి గృహాల్లో నిర్దిష్టమైన రిజిస్టర్లు, రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. అలాగే జువెనైల్ జస్టిస్ వ్యవస్థలోని అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ బాలలకు మెరుగైన వసతి, సంరక్షణ సౌకర్యాలు అందించాలని సూచించారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ పుచ్చల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఆదరణ మరియు సంరక్షణ అవసరమైన ప్రతి బాలుడికి తప్పనిసరిగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉత్తర్వులు ఉండాలని, కమిటీ జారీ చేసిన ఉత్తర్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ దిక్కరించరాదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి స్వచ్ఛంద సంస్థలకు మంజూరైన ఫైనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ (జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్) కుమారి టి. జ్యోతి స్థానికంగా ఉన్న 23 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయా సంస్థలు తమ గృహాల్లో బాలలకు అందిస్తున్న సేవలను గుణాత్మకంగా అందించడంతో పాటు, వారి అభిరుచులకు అనుగుణంగా ప్రోత్సహించి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ పుచ్చల వెంకటేశ్వరరావు, డీపీఓ మిస్ జ్యోతి, డీసీపీయూ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్. సూర్యచక్రవేణి, 23 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నాగేష్ (నూజివీడు), మాధవి (అప్పన్వీడు), షేర్ (కలపర్రు)తో పాటు డీసీపీయూ సిబ్బంది శ్రీకాంత్, రాజేష్, రాజకుమార్, సునీత తదితరులు పాల్గొన్నారు.















Social Plugin