జాతీయ రైతుదినోత్సవం సందర్భంగా ఏలూరు రైతు దంపతులకు ‘పుడమిపుత్ర’ పురస్కారం


ఏలూరు, పెదవేగి, డిసెంబరు 23: జాతీయ రైతుదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకృతి వ్యవసాయంలో (APCNF) ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతు దంపతులకు ప్రతిష్టాత్మక ‘పుడమిపుత్ర పురస్కారం–2024’ లభించింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన కలా చంద్రరావు – దంపతులు ఈ గౌరవాన్ని అందుకున్నారు.


హైదరాబాద్ నాంపల్లి గాంధీభవన్ కేంద్రంగా మంగళవారం నిర్వహించిన మహాత్మాగాంధీ స్థిర విజ్ఞాన సదస్సు – స్వదేశీ మేళా 2025 కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో విశేష సేవలు అందిస్తున్న రైతులను ఈ సందర్భంగా సత్కరించారు.


కలా చంద్రరావు తనకు ఉన్న సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూమిలో పాలి క్రాపింగ్ విధానాన్ని అనుసరిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి, మట్టిసారాన్ని కాపాడుతూ స్థిరమైన దిగుబడులు సాధించడం ద్వారా ఆయన రైతులకు ఆదర్శంగా నిలిచారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి, రైతు ఆదాయం పెంపు సాధ్యమని తమ ఆచరణతో నిరూపించినందుకుగాను రైతు దంపతులను సంయుక్తంగా ఈ పురస్కారంతో సత్కరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవార్డు ఇతర రైతులను కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.