ఏలూరు జిల్లా, బుట్టయిగూడెం, డిసెంబర్ 23: ఇనుమూరు గ్రామంలో గిరిజనులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి, అడ్డువచ్చిన గిరిజనులు మరియు గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన పోలీస్, రెవెన్యూ అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు మెయిల్ ద్వారా వినతిపత్రం పంపినట్లు జిల్లా కార్యదర్శి ఏ. రవి తెలిపారు.
బుట్టయిగూడెం మండలం అంతర్వేదిగూడెం శివారు ఇనుమూరు గ్రామంలో 57 గిరిజన (కోయ – ఎస్టీ) కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయమేనని పేర్కొన్నారు. గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 221, 223, 210, 217, 213, 214లలో ఉన్న భూములు ప్రభుత్వ భూములుగా అధికారిక సర్వేలో నమోదు అయ్యాయని వివరించారు.
ఈ భూములను గిరిజనుల పూర్వికులు చదును చేసి సాగులోకి తెచ్చారని, తరం తరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ భూములపై గిరిజనులకు తప్ప ఇతరులకు ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేశారు. అయినప్పటికీ గిరిజనేతర భూస్వాములకు అనుకూలంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి గిరిజనులు పండిస్తున్న మొక్కజొన్న పంటను దున్నించి ధ్వంసం చేశారని ఆరోపించారు.
పంటల ధ్వంసాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన గిరిజనులపై విచక్షణారహితంగా దాడులు జరిపారని, మహిళలపై కూడా మగ పోలీసులు దాడికి పాల్పడటం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. ఈ భూముల విషయంలో ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ, న్యాయ ప్రక్రియను పక్కనపెట్టి అధికారులే దౌర్జన్యాలకు పాల్పడటం అత్యంత ఆందోళనకరమని సీపీఎం పేర్కొంది.
గిరిజనుల పంటలను ధ్వంసం చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన పోలీస్, రెవెన్యూ అధికారులపై తగు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సీపీఎం డిమాండ్ చేసింది. గిరిజనుల భూములు, జీవనోపాధిని పరిరక్షించాలని వినతిపత్రంలో కోరింది.















Social Plugin