గ్యాండిపోశమ్మ యాత్ర దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందగా … విద్యుత్‌ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి


యలమంచిలి: అల్లూరి సీతారామరాజు జిల్లా గండిపోశమ్మ ఆలయ దర్శనం ముగించుకుని వస్తుండగా వ్యాను అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దొడ్డిపట్లకు చెందిన గెద్దాడ రాజేశ్‌ (35) రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్థరాత్రి మృతిచెందారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తూ ఉన్న రాజేశ్‌కు అబ్బిరాజుపాలేనికి చెందిన కాండ్రేగుల నరసింహస్వామితో మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ కలిసి యాత్రకు వెళ్లగా, నరసింహస్వామి ఘటన స్థలంలోనే, రాజేశ్‌ చికిత్స సమయంలో మరణించారు.

వాయిదా వేయొద్దని నిర్ణయం… విషాదంలో ముగింపు
స్థానికుల సమాచారం ప్రకారం, అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్లకు చెందిన 13 మంది బృందం ఆదివారం గండిపోశమ్మ దర్శనానికి వెళ్లేందుకు రెండు రోజుల క్రితమే ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే తుపాను ప్రభావంతో వాతావరణం మారడంతో వారు యాత్రను వాయిదా వేయాలని తొలుత అనుకున్నారు. కానీ అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత వాయిదా వేయడం అవసరం లేదనుకున్నారు. 

దీంతో ఆదివారం ఉదయం బయలుదేరిన యాత్ర మార్గమధ్యంలో ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరి ప్రాణాలు పోయాయని గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దొడ్డిపట్లకు చెందిన కుంచే శ్రీను రాజమహేంద్రవరం లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులైన నరసింహస్వామి, రాజేశ్‌ మృతదేహాలు సోమవారం వారి స్వగ్రామాలకు తరలించగా, నరసాపురం ఆర్డీవో దాసి రాజు, తహసీల్దారు పవన్‌కుమార్‌ నివాళులర్పించారు.

విద్యుత్‌ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

కూచింపూడి, పెదవేగి: కూచింపూడి గ్రామానికి చెందిన దిమ్మిటి చినరాటాలు(37) రోజువారీగా ఆయిల్‌పామ్‌ గెలలు కోసే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తాడు. సోమవారం ఉదయం రామశింగవరంలోని ఒక రైతు తోటలో పనిచేస్తుండగా, ఆయన చేతిలో ఉన్న అల్యూమినియం పైపు జారి విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో చినరాటాలు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య జ్యోతి, పదో తరగతి, డిగ్రీ చదువుతున్న ఇద్దరు కుమారులున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై కె.రామకృష్ణ మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.