ఏలూరు: ఏలూరు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సెకండ్ ఇయర్ విద్యార్థులపై థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వేధింపులకు పాల్పడ్డారని సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ ర్యాగింగ్ కొనసాగుతున్నప్పటికీ, భయంతో బాధితులు ఎవరికి చెప్పలేదని తెలుస్తోంది. పరిస్థితి అధికమించడంతో జూనియర్ విద్యార్థులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సోమవారం అర్థరాత్రి హాస్టల్‌కి చేరుకుని విచారణ మొదలుపెట్టారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు దుర్మరణం
ఉంగుటూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు సమీపంలోని 216ఏ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల వివరాల ప్రకారం, చేబ్రోలు ప్రాంతానికి చెందిన రావాడ రమాభాయి (60) కొంతకాలంగా మతిస్థిమితం సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా రోజంతా ఊరి చుట్టుపక్కల తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుతుంటారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున రహదారిపై నడుస్తుండగా తెలియని వాహనం ఢీకొట్టి పారిపోయింది. తీవ్ర గాయాల కారణంగా రమాభాయి అక్కడికక్కడే మరణించారు. ఆమె భర్త రమణయ్య ఇప్పటికే మరణించారు. వివాహిత కుమారుడు, కుమార్తె ఉన్నారు. అసలుకు శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం దొంపాక గ్రామానికి చెందిన వారు అయిన రమాభాయి, కొన్ని సంవత్సరాల క్రితం చేబ్రోలు ప్రాంతంలో స్థిరపడ్డారు.















Social Plugin