ట్రిపుల్‌ ఐటీ ఎన్‌సీసీ క్యాడెట్ల ప్రతిభ జాతీయస్థాయిలో మెరిసింది


ఏలూరు జిల్లా, నూజివీడు రూరల్: నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు. వారు రూపొందించిన *కౌంటర్‌ డ్రోన్‌ ఎయిర్‌ మానిటరింగ్‌ అండ్‌ న్యూట్రలైజేషన్‌ సిస్టమ్* ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో మొదటి స్థానం సాధించింది. కాకినాడ ఎన్‌సీసీ గ్రూప్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన *ఐడియా అండ్‌ ఇన్నోవేషన్‌ కాంపిటీషన్*లో ఈ ప్రాజెక్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి జ్యూరీ ప్రశంసలు పొందింది.


పోటీల్లో నుంచే విజయయాత్ర
నవంబర్‌ 2, 3 తేదీల్లో నూజివీడులో జరిగిన పోటీల్లో ట్రిపుల్‌ ఐటీ ఎన్‌సీసీ క్యాడెట్లు సీహెచ్‌. యువసాయిప్రదీప్‌, బి. త్రిలోక్‌ ఈ డ్రోన్‌ వ్యవస్థను మొదట ప్రదర్శించారు. స్థానిక స్థాయిలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం నవంబర్‌ 10 నుంచి 16 వరకు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఆల్‌ ఇండియా లెవల్‌ *ఐడియా అండ్‌ ఇన్నోవేషన్‌ పోటీలో* పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 85 ఉత్తమ ప్రాజెక్టుల మధ్య పోటీ పడుతూ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ప్రాజెక్ట్‌ టాప్‌ 30లో స్థానం దక్కించుకుంది. ఏపీ–తెలంగాణ రేంజ్‌లో ప్రథమ స్థానం సాధించడం గమనార్హం. విద్యార్థులను ఆర్జీయూకేటీ డైరెక్టర్‌ సండ్ర అమరేంద్ర కుమార్‌, ఎన్‌సీసీ అధికారి కెప్టెన్‌ సీహెచ్‌.ఎస్‌.ఆర్‌. నవీన్‌కుమార్‌ అభినందించారు.

దేశ భద్రత కోసం రూపొందించిన సాంకేతికత
ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండేలా ఈ వ్యవస్థను రూపొందించినట్టు విద్యార్థులు తెలిపారు. ఈ ప్రత్యేక డ్రోన్‌ అత్యాధునిక విజన్‌ టెస్ట్‌ టెక్నాలజీ, పలు సెన్సర్ల సహాయంతో పేలుడు పదార్థాలు లేదా ప్రమాదకర వస్తువులు మోసుకుని వచ్చే శత్రు డ్రోన్లను గుర్తిస్తుంది. వెంటనే గ్రౌండ్‌ స్టేషన్‌కు అలర్ట్‌ పంపిస్తుంది. శత్రు డ్రోన్లను కేవలం గుర్తించడమే కాకుండా, గగనతలంలోనే నిర్వీర్యం చేసే సామర్థ్యాన్ని కూడా ఈ సిస్టమ్‌లో ఏర్పాటు చేశారు.