పెదవేగి మండలం కూచిపూడిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి… 7 మంది అరెస్ట్, రూ.32 వేల నగదు స్వాధీనం


ఏలూరు జిల్లా, పెదవేగి: పెదవేగి మండలంలోని కూచిపూడి గ్రామంలో పేకాట ఆడుతున్నారని అందిన సమాచారంతో పెదవేగి పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ మరియు నూజివీడు డిఎస్పి కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, అసాంఘిక కార్యకలాపాల నివారణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


పెదవేగి సీఐ సిహెచ్. రాజశేఖర్కు అందిన సమాచారం మేరకు, ఎస్ఐ హరి గోపాల్ తన సిబ్బందితో కలిసి కూచిపూడి గ్రామంలోని పేకాట స్థావరంపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 7 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి మొత్తం రూ.32,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పెదవేగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఐ హరి గోపాల్ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేకాట, కోడి పందాలు, అక్రమ మద్యం రవాణా వంటి కార్యకలాపాలు ప్రజల జీవితాలపై తీవ్ర దుష్ప్రభావాలు చూపుతాయని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గ్రామీణ ప్రజలు ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించిన ఎస్ఐ, ఈ తరహా అక్రమాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు డయల్ 112 లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు.