పొరపాటున వేరే ఖాతాకు వెళ్లిన ₹50,000 నగదు రికవరీ


బాధితురాలికి అందజేసిన ఏలూరు సైబర్ సెల్ సీఐ జి. దాసు


ఏలూరు | డిసెంబర్ 30: డిజిటల్ లావాదేవీల్లో అప్రమత్తత అవసరమని సూచిస్తూనే, పొరపాటున నగదు కోల్పోయిన బాధితురాలికి అండగా నిలిచి ₹50,000 నగదును విజయవంతంగా రికవరీ చేసి అందజేసిన ఏలూరు జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులను జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.

ఏలూరుకు చెందిన బి. సురేఖ అనే మహిళ తన ఫోన్‌పే (PhonePe) యాప్ ద్వారా ఒకరికి నగదు పంపే ప్రయత్నంలో పొరపాటున మరొకరి ఖాతాకు ₹50,000/- బదిలీ అయ్యింది. ఈ ఘటనతో ఆందోళనకు గురైన ఆమె వెంటనే ఏలూరు సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన ఏలూరు జిల్లా సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ జి. దాసు తక్షణమే చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను వినియోగించి నగదు జమ అయిన ఖాతాదారుడి వివరాలను గుర్తించి, సంబంధిత వ్యక్తితో మాట్లాడి బాధితురాలి సొమ్మును పూర్తిగా రికవరీ చేయడంలో విజయం సాధించారు.

రికవరీ చేసిన ₹50,000 నగదును సీఐ దాసు నేరుగా బాధితురాలికి అందజేశారు. పోగొట్టుకున్న నగదు తిరిగి దక్కడంతో సురేఖ సైబర్ క్రైమ్ పోలీసులకు, ప్రత్యేకించి సీఐ దాసు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు సైబర్ సెల్ సీఐ కీలక సూచనలు
ఈ సందర్భంగా సైబర్ సెల్ సీఐ జి. దాసు ప్రజలకు పలు ముఖ్య సూచనలు చేశారు.

🔹 ఆన్‌లైన్ / యూపీఐ (UPI) ద్వారా డబ్బులు పంపేటప్పుడు మొబైల్ నంబర్, ఖాతాదారు పేరు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.
🔹 పెద్ద మొత్తంలో నగదు పంపేటప్పుడు ముందుగా ₹1 పంపి పేరు సరిగా ఉందో లేదో నిర్ధారించుకున్న తర్వాతే పూర్తి మొత్తం పంపడం ఉత్తమం.
🔹 పొరపాటున నగదు వేరే ఖాతాకు వెళ్లినట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత బ్యాంక్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలి.

సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ఇటువంటి ఆర్థిక నష్టాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని పోలీస్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.