బాధితుడికి ₹8,000 అందజేసిన ఏలూరు సైబర్ సెల్ సీఐ జి. దాసు
ఏలూరు/కైకలూరు | డిసెంబర్ 30: సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సైబర్ నేరాలను అరికట్టడమే కాకుండా, పొరపాటున ఆర్థిక నష్టానికి గురైన బాధితులకు భరోసా కల్పిస్తూ ఏలూరు జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కైకలూరు మండలం సింగాపురం గ్రామానికి చెందిన బి. మల్లికార్జున రావు తన ఫోన్‌పే (PhonePe) యాప్ ద్వారా ఒక వ్యక్తికి డబ్బులు పంపే క్రమంలో మొబైల్ నెంబర్ తప్పుగా నమోదు చేయడంతో ₹8,000/- నగదు పొరపాటున వేరే వ్యక్తి ఖాతాలోకి బదిలీ అయ్యింది. తాను పంపిన నగదు సంబంధిత వ్యక్తికి చేరలేదని గుర్తించిన బాధితుడు ఆందోళనతో వెంటనే ఏలూరు సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన ఏలూరు జిల్లా సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ జి. దాసు, మహిళా ఎస్‌ఐ వల్లి పద్మ తో కలిసి తక్షణమే చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను ఉపయోగించి నగదు జమ అయిన ఖాతాదారుడి వివరాలను సేకరించి, సంబంధిత వ్యక్తితో మాట్లాడి బాధితుడి నగదును పూర్తిగా రికవరీ చేయడంలో విజయం సాధించారు.
రికవరీ చేసిన ₹8,000/- నగదును సీఐ జి. దాసు నేరుగా బాధితుడు మల్లికార్జున రావుకు అందజేశారు. తన కష్టార్జితాన్ని తిరిగి పొందిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు, ప్రత్యేకంగా సీఐ దాసు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
సైబర్ లావాదేవీల్లో అప్రమత్తతతో పాటు, ఏ చిన్న తప్పిదం జరిగినా వెంటనే పోలీసులను సంప్రదిస్తే న్యాయం సాధ్యమవుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించిందని పోలీస్ అధికారులు తెలిపారు.















Social Plugin