ఏలూరు, డిసెంబర్ 16: ఏలూరు జిల్లాలో డిసెంబర్ 21, 2025న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి (డీసీహెచ్‌ఎస్) డా. పాల్ సతీష్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల సుమారు రెండు లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పిల్లలందరికీ సురక్షితంగా టీకాలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా అమలుకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,709 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డా. పాల్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ప్రతి అర్హత గల చిన్నారికి పోలియో చుక్కలు అందిస్తామని చెప్పారు.
అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆసుపత్రుల్లో కూడా పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ తమ సమీపంలోని పోలియో కేంద్రాలను సందర్శించి, ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమం విజయానికి సహకరించాలని డీసీహెచ్‌ఎస్ కోరారు.















Social Plugin