మారిషస్‌లో నిర్మాణ రంగానికి అంతర్జాతీయ ఉద్యోగావకాశాలు: జితేంద్ర బాబు


ఏలూరు, డిసెంబరు 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మరియు ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (OMCAP) సంయుక్తంగా మారిషస్‌లో నిర్మాణ రంగానికి సంబంధించిన నైపుణ్య ఉద్యోగాల కోసం అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. జితేంద్ర బాబు మంగళవారం తెలిపారు.


ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి చెందిన అనుభవజ్ఞులైన నిర్మాణ రంగ కార్మికులకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. క్యాషియర్, షెల్వ్స్ వర్కర్, ఎయిర్ కండిషనింగ్ టెక్నిషియన్, వెల్డర్, ఫోర్క్‌లిఫ్ట్ డ్రైవర్, ఎలక్ట్రిషియన్, కుక్, ఎలక్ట్రోమెకానికల్ టెక్నిషియన్, ఫ్యాక్టరీ ఆపరేటర్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.

ఎస్‌ఎస్‌సీ / డిప్లొమా / డిగ్రీ అర్హతలతో పాటు సంబంధిత రంగంలో 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం కలిగి, 23 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 నుంచి రూ.77,000 వరకు జీతం చెల్లించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ కాలం 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుందని వివరించారు.

ఈ ఉద్యోగాలకు అక్కమోడేషన్, లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్, వర్క్ వీసా, జాయినింగ్ ఎయిర్ టికెట్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే సీవీ, పాస్‌పోర్ట్, విద్యార్హతలు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబరు 18, 2025 అని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు [https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration](https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration) వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9988853335, 8712655686 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్ర బాబు సూచించారు.