ఏలూరు, డిసెంబరు 16: ఏలూరు జిల్లా బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రంలో 137వ శిక్షణా బృందానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జి జిల్లా మత్స్యశాఖ అధికారి బి. రాజ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ పేరు, చిరునామా, జన్మతేది, విద్యార్హతలు, అనుభవ వివరాలతో కూడిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోగా మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి (ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లా) వారి కార్యాలయానికి చేరేలా పంపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలకు చెందిన మత్స్యకారులు, యువకులు, జాలర్లు, సహకార సంఘాల సభ్యులు, చేపల పెంపకంలో ఆసక్తి గల ఇతరులు, అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. మొత్తం 20 సీట్లు మాత్రమే ఉండగా, ఈ శిక్షణకు ఎటువంటి ఉపకార వేతనం ఉండదని స్పష్టం చేశారు.
అభ్యర్థుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థుల పేర్లను అదే రోజు సాయంత్రం 4 గంటల అనంతరం కార్యాలయ నోటీసు బోర్డులో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఎంపికైన వారికి మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కాలం 2026 జనవరి 1 నుండి మార్చి 31 వరకు కొనసాగుతుందని, ఇందులో మత్స్య క్షేత్రాలు, రిజర్వాయర్లలో చేపల పెంపకంపై థియరీతో పాటు ప్రాక్టికల్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయ్యాక పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు.
విద్యార్హతగా కనీసం 5వ తరగతి లేదా అంతకంటే పై చదువు ఉండాలని, తెలుగులో చదవడం, రాయడం తెలిసిన వారికి కూడా అవకాశం కల్పిస్తామని తెలిపారు. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలని, అవసరమైతే ఎంపిక కమిటీ ప్రత్యేక పరిగణనలో వయోపరిమితిని సడలించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తులతో పాటు అనుభవ సర్టిఫికెట్లను జతచేయాలని, ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించారు.
ఇతర వివరాల కోసం మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి (సెల్: 95733 37484), మత్స్యశాఖ అధికారి బాదంపూడి–1 (సెల్: 72869 93033) లేదా మత్స్యశాఖ అధికారి బాదంపూడి–2 (సెల్: 94923 37469)లను కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చని తెలిపారు.















Social Plugin