టైగర్ ఎస్టిమేషన్–2026 కు ఏలూరు అటవీ విభాగం సిద్ధం


ANDRAPRADESH, ఏలూరు జిల్లా, ఏలూరు: ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (AITE)–2026 కోసం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ డిసెంబర్ 1 నుండి సన్నద్ధమవుతోందని జిల్లా అటవీశాఖాధికారి (టెరిటోరియల్) సందీప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా పులుల సంఖ్య అంచనా వేయడమే కాకుండా అటవీ ఆరోగ్యాన్ని విశ్లేషించేందుకు నిర్వహించే అతిపెద్ద వన్యప్రాణి సర్వే ఇదేనని ఆయన తెలిపారు.


పులులు అటవీ పరిరక్షణకు సూచిక జాతులుగా ఉండి పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తాయని డీఎఫ్‌వో సందీప్ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు అటవీ విభాగంలోని పాపికొండలు నేషనల్ పార్క్ నార్త్ ఈస్ట్రన్ ఘాట్స్‌లో పులుల సంరక్షణకు చివరి ముఖ్య ఆశగా ఉండటంతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల పులుల నివాసాలను కలిపే కీలక కారిడార్‌గా పనిచేస్తుందని ఆయన వివరించారు.

గత కొన్నేళ్లలో పాపికొండలలోని ఉడతపల్లి, కోవ్వడ, గెడ్డపల్లి పరిసర ప్రాంతాల్లో పులుల సంచారం గుర్తించబడిందని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే సర్వేను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు ఏలూరు విభాగం పూర్తిగా సిద్ధంగా ఉందని, సిబ్బందితో సమీక్ష నిర్వహించి తగిన సూచనలు జారీ చేశామని చెప్పారు. ఫ్రంట్‌లైన్ సిబ్బందికి శిక్షణ అందించడంలో WWF కూడా అటవీశాఖకు సహకరిస్తోందని డీఎఫ్‌వో సందీప్ రెడ్డి పేర్కొన్నారు.