సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేద ప్రజలకు చేసిన సేవలు నిలిచే ఉంటాయి: శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్

ఎమ్మెల్యే  సొంగా రోషన్ కుమార్ 

చరిత్ర సృష్టించడం కోసమే పుట్టిన మహానేత ఎన్టీఆర్...

తెలుగుజాతి చరిత్రలో ఎన్టీఆర్ కీర్తి అజరామరం...
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చింతలపూడి పట్టణం వెలమపేట వద్ద NTR గారి కి ఘన నివాళులర్పించిన  శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్..

ఏలూరు జిల్లా,చింతలపూడి: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మకుటం లేని మహారాజు స్వర్గీయ ఎన్టీఆర్ కీర్తి తెలుగుజాతి ఉన్నంతవరకూ అజరామరంగా నిల్చి ఉంటుందని ఎమ్మెల్యే రోషన్ అన్నారు, మహానుభావులు కొందరే ఉంటారని, చరిత్ర సృష్టించడం కోసమే ఎన్టీఆర్ వంటి మహనీయులు పుడతారని ఆయన అన్నారు. నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు పండ్లు, బన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుల్లో చిరస్మరణీయుడు నందమూరి తారకరామారావు ని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించడం, తొమ్మిది నెలల కాలంలోనే చరిత్ర సృష్టించి అధికారంలోకి తీసుకురావడం ఆయనకే చెల్లిందని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.  

ప్రజా ప్రతినిధులు అంటే హైదరాబాదులోనే ఉంటారు, ప్రజలకు కనపడరు, ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రమే కనపడతారు అనే నానుడి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు ఉండేదని, దానిని మార్చి సామాన్యులను ఎందరినో రాజకీయాల్లోకి తీసుకువచ్చి, విద్యావంతులు ఎందరినో రాజకీయాల్లోకి తీసుకువచ్చి, రాజకీయాల్లో ఓనమాలు తెలియని వారిని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు.  

అందులో నేను ఉన్నందుకు అదృష్టం గా భావిస్తున్నాను అని అన్నారు, ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈనాటికి మన రాష్ట్రానికే కాదు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలే నేటికీ శిరోధార్యంగా ఉన్నాయని అన్నారు. నాడు ఎన్టీఆర్ వృద్ధులకు, వితంతువులకు పింఛన్ అందించే పథకం తీసుకొచ్చారని, నాడు ఆయన ఇచ్చిన రూ.30ల పింఛన్ నేడు రూ.4వేలకు చేరిందన్నారు. 
పింఛన్ అయినా, పేదలకు బియ్యం పంపిణీ అయినా, జనతా వస్త్రాలైన, తెలుగు గ్రామీణ క్రాంతిపథం అయినా పేద ప్రజలే దేవుళ్ళుగా పరిపాలన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు అని కొనియాడారు. ఆయన పరిపాలించింది కేవలం 7 ఏళ్ల 8నెలల కాలం అయినా  అది ఒక చరిత్రగా నిలిచిందని, ఎన్టీ రామారావు పరిపాలన అంటే చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచిందన్నారు. 

నదుల అనుసంధానం కోసం తమిళనాడుకు తెలుగు గంగతో నీళ్లు ఇచ్చినా, నేడు జరుగుతున్న ప్రాజెక్టులకు సంకల్పం చేసినా ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలే అన్నారు. సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేద ప్రజలకు చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.