ఏలూరు జిల్లా నూజివీడు: పట్టణంలోని రెల్లి పేటకు చెందిన ఓ మైనర్ బాలికను ఆకతాయి నిత్యం వేధిస్తున్నాడన్న ఆరోపణల మధ్య, ఆ బాలిక శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బాధిత బాలిక తల్లి సింగంపల్లి శ్యామల తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం నాడు ఇంటికి వస్తున్న సమయంలో ఆకతాయి తన కుమార్తెను కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైందన్నారు.
పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న శ్యామల, ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాలూరి శ్యామ్ సంతోష్ అనే యువకుడు నిత్యం వెంటపడి వేధించడంతో తట్టుకోలేకే తమ కుమార్తె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని వాపోయారు.
ఆసుపత్రిలో తన కుమార్తె చికిత్స పొందుతున్న పరిస్థితి తనకు తీవ్ర భయాన్ని కలిగిస్తోందని, ఏ క్షణంలోనైనా ఆ ఆకతాయి దాడి చేసి ప్రాణం మీదకు తెస్తాడేమోనన్న ఆందోళనతో ఉన్నట్లు శ్యామల తెలిపారు.
ఈ నేపథ్యంలో నేడు నూజివీడు సబ్ కలెక్టర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నట్లు ఆమె చెప్పారు. ఈ ఘటనపై న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు శ్యామల వెల్లడించారు. నిత్యం వేధింపుల కారణంగా తమ కుటుంబానికి ప్రాణభయం నెలకొందని, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.
















Social Plugin