ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదల కడుపు కొట్టిన మోడీ ప్రభుత్వం

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శ్రీనివాస్ విమర్శ

ఏలూరు జిల్లా, మండవల్లి: కేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దుచేసి, విబి-జి రామ్ జి 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చి పని హక్కును రద్దుచేసి పేదల కడుపు కొట్టిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. శ్రీనివాస్ విమర్శించారు.

ఉపాధి హామీ చట్టం రక్షణకు సిపిఎం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం మండవల్లి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ వి బి జి రామ్ జి చట్టం పూర్తిగా గ్రామీణ పేదలకు వ్యతిరేకమైనదని చెప్పారు. ఉపాధిని ఒక హక్కుగా కాకుండా ప్రభుత్వాల ప్రాయోజత పథకంగా కేంద్రం మార్చి వేసిందన్నారు. గత చట్టంలో ఉండే 90 శాతం కేంద్ర ప్రభుత్వ వాటా నిధులను 60 శాతానికి కుదించిందని, 10 శాతంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల వాటాను 40 శాతానికి పెంచారని చెప్పారు.


 ఉపాధి పొందేందుకు గ్రామీణ పేదలకు ఉన్న హక్కును హరించి వేసి ఉపాధి హామీని ప్రభుత్వాలు ఇచ్చే బిక్ష కింద మార్చి వేయడం దారుణం మని విమర్శించారు. పాత చట్టంలో కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయించే విధానం నుండి కొత్త చట్టంలో రాష్ట్రాలు ముందుగా ఖర్చు చేసిన తర్వాత కేంద్రం తన వాటా నిధులను ఇచ్చే పద్ధతిని తీసుకువచ్చారని అన్నారు. పేరుకు 125 రోజులు పని దినాలకు పెంచినా ఆచరణలో పని కల్పించే దినాల సంఖ్య తగ్గేలాగా నిధుల కేటాయింపును తగ్గించారన్నారు. 

2020-21 లో 1,20,000 కోట్లు కేటాయించిన కేంద్రం 2024-25, 2025-26 సంవత్సరాలలో 86 వేల కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. గ్రామీణ పేదలకు ఒక హక్కుగా ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ ప్రాయోజిత పథకంగా ఉన్నప్పుడు మరింత దారుణమైన స్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పని గతంలో లాగా ఏ రోజుల్లో కావాలో కార్మికులు అడిగినప్పుడు పని కల్పించే విధానం ఉండదన్నారు. 

పని చూపకపోతే నిరుద్యోగ భృతి ఉండదని, ప్రాంతాలు, పనులు కేంద్రమే నిర్ణయిస్తుందన్నారు. మహాత్మా గాంధీ పేరు స్థానంలో జి రామ్ జి పేరు మార్చడమే కాదని, మొత్తం చట్టం యొక్క సారాన్ని నిర్వీర్యం చేసి పేద ప్రజల ఉపాధికే ఎసరు పెట్టిందన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు, కార్మికులు పాల్గొన్నారు.