క్షేత్రస్థాయిలో కేంద్ర బృందం పరిశీలన
తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం: మండలంలో త్వరలో జూపార్కు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన ముందుకు సాగుతోందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. ప్రకృతి పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమని పేర్కొన్నారు.
బుధవారం రాజానగరం మండల పరిధిలోని దివాన్ చెరువులో ఉన్న అటవీ భూమిని ఎంపీ పురంధేశ్వరి నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తయ్యాక త్వరలో కార్యాచరణ రూపకల్పన చేస్తామని తెలిపారు.
ప్రాంత భౌగోళిక పరిస్థితులు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ అనుకూలతలను కేంద్ర బృంద సభ్యులతో కలిసి అధ్యయనం చేసినట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం రాజానగరంలో సుమారు 311 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉందని, అందులో 250 హెక్టార్ల భూమిని జూపార్కు కోసం వినియోగించే అవకాశం ఉందన్నారు.
ఈ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఆఫీసర్ బెన్ నేతృత్వంలోని బృందాన్ని రాజానగరానికి పంపినట్లు ఎంపీ తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం జూపార్కు ఏర్పాటుకు ఈ ప్రదేశం అనుకూలమని బృందం నిర్ధారించినట్లు పేర్కొన్నారు.
జంతువులు, పక్షులను బంధించకుండా సహజ వాతావరణంలోనే సందర్శకులు వీక్షించేలా సరికొత్త విధానంలో జూపార్కును అభివృద్ధి చేయనున్నట్లు ఎంపీ పురంధేశ్వరి స్పష్టం చేశారు. అన్ని అనుకూలిస్తే రాజానగరానికి త్వరలో జూపార్కు రానుందని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆమె తెలిపారు.
ఈ పర్యటనలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, సెంట్రల్ జూ అథారిటీ సభ్య కార్యదర్శి డా. వి. క్లెమెంట్ బెన్, వన్యప్రాణి–ప్రాజెక్ట్ ఎలిఫెంట్–ఫారెస్ట్ ప్రొటెక్షన్–రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అజయ్, డీఎఫ్‌ఓ రాజమహేంద్రవరం బి. ప్రభాకర రావు, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ఆర్. శ్రీనివాస్, ఎఫ్‌ఆర్‌ఓ దావీద్ రాజు, పద్మావతి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ లత, ఎఫ్‌బీఓ రంగారావు తదితర అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాజానగరంలో జూపార్కు ఏర్పాటుకు ప్రతిపాదన https://t.co/Ae1AihNruC
— ELURU NEWS (@EluruNews90170) January 7, 2026
.jpeg)















Social Plugin