ఏలూరు: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పరిధిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోలీస్ కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారు వారి సతీమణి శ్రీమతి ధాత్రి రెడ్డి ఐఏఎస్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు.
పండుగలను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వేడుకల్లో పోలీస్ కుటుంబాల మహిళలు రంగురంగుల హరివిల్లుల ముగ్గులు వేసి పెరేడ్ గ్రౌండ్‌ను సుందరంగా అలంకరించారు. అందమైన ముగ్గులు వేసిన మహిళలకు జిల్లా ఎస్పీ దంపతులు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సాంస్కృతిక విశిష్టతను వివరించారు. పాడిపంటలు సమృద్ధిగా పండేందుకు పశువుల పాత్ర ఎంతో కీలకమని, అందుకే పశువులకు అంకితమైన పండుగలకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు.
వేడుకల్లో ఎద్దుల బండి ప్రదర్శన, హరిదాసుల వేషధారణ, బాలికల కర్రసాము వంటి సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించి సంక్రాంతి సంబరాలకు మరింత శోభను తీసుకువచ్చారు. భోగి పండుగ సందర్భంగా భోగి పళ్ళ ఉత్సవాన్ని కూడా అంగరంగ వైభోగంగా నిర్వహించారు.
ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు మొదటి బహుమతిగా రూ.15,000, రెండో బహుమతిగా రూ.10,000, మూడో బహుమతిగా రూ.5,000లను జిల్లా ఎస్పీ గారు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జంగారెడ్డి గూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్ ఐపీఎస్, ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ, ఏలూరు జిల్లా అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సంక్రాంతి సంబరాలు పోలీస్ కుటుంబాల్లో ఆనందోత్సాహాలను నింపుతూ, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని మరింత పెంచాయి.















Social Plugin