ఏలూరు జిల్లా, ఆగిరపల్లి: దేశంలోని ప్రతి కుటుంబానికి స్టవ్, సిలిండర్, రెగ్యులేటర్‌తో కూడిన గ్యాస్ కనెక్షన్ అందించాలనే సదుద్దేశంతో కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం “ప్రధానమంత్రి ఉజ్వల యోజన 1.0”ను ప్రకటించి విజయవంతంగా అమలు చేసింది. ఈ పథకం ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందాయి.
మిగిలిపోయిన అర్హులైన కుటుంబాలకు, అలాగే నూతనంగా ఏర్పడిన కుటుంబాలకు కూడా గ్యాస్ కనెక్షన్లు అందించాలనే ఉద్దేశంతో “ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0”ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ప్రస్తుతం అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఆగిరిపల్లి మండలంలో మొత్తం 50 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు.
ఎంపికైన లబ్ధిదారుల్లో సుమారు 40 మంది ఈదర గ్రామానికి చెందిన వారు కావడం విశేషం. ఈ నేపథ్యంలో ది.13-01-2026 మంగళవారం రోజున ఆగిరిపల్లిలోని శ్రీ భాగ్యలక్ష్మి ఇండేన్ గ్యాస్ కంపెనీ వద్ద ఈదర గ్రామానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జి.ఆర్.కే. రంగారావు, పూర్వ ఆగిరిపల్లి మండల బీజేపీ అధ్యక్షులు కొవ్వలి బాబురావు, ఈదర గ్రామానికి చెందిన కూటమి టీడీపీ యువ నాయకులు దొండపాటి విక్రమ్ పాల్గొన్నారు. అలాగే గ్యాస్ కంపెనీ యజమాని పాలడుగు శ్రీనివాసరావు ని కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా నాయకులు లబ్ధిదారులతో మాట్లాడుతూ ఉజ్వల యోజన పథకం అమలు జరుగుతున్న తీరును వివరించారు. పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించడం ద్వారా ఆరోగ్య రక్షణతో పాటు ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. గ్రామస్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.















Social Plugin