నందిగామలో ఉపాధి హామీ పనుల పరిశీలన
— వేతనాలు నిర్దిష్టంగా అందేలా చర్యలు: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
ఎన్‌టీఆర్ జిల్లా, నందిగామ: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ గురువారం నందిగామ మండలం కంచెల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా రూ.66,690 అంచనా వ్యయంతో 1,200 మీటర్ల పొడవున చేపడుతున్న పంట కాలువ పూడిక తీత పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. పనుల పరిమాణం, పూర్తయిన కొలతలు, ఉపాధి శ్రామికులకు అందుతున్న వేతనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఉపాధి శ్రామికుడికి కచ్చితంగా రూ.307 వేతనం అందేలా నిర్దిష్ట కొలతల ప్రకారం పని చేయాలని శ్రామికులకు సూచించారు.
అనంతరం కొత్త కంచెల గ్రామంలో పల్లె పండుగ 2.0 కార్యక్రమం కింద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒక్కోటి రూ.2 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన రెండు పశువుల షెడ్లను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి, ఈ షెడ్ల వలన కలిగే ఉపయోగాలను తెలుసుకున్నారు.
అలాగే పల్లె పండుగ 1.0 కింద కంచెల గ్రామంలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో పూర్తిచేసిన సీసీ రోడ్డును కలెక్టర్ పరిశీలించారు. ఈ తరహా పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పల్లె పండుగ 2.0లో కొత్తగా మంజూరు అయిన రోడ్ల నిర్మాణ పనులను కూడా ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.















Social Plugin