అగ్రిగోల్డ్ భూముల భౌతిక పరిశీలన
— క్షేత్రస్థాయిలో జిల్లాస్థాయి కమిటీ సందర్శన: విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య
ఎన్‌టీఆర్ జిల్లా, విజయవాడ: అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ప్రభుత్వ అటాచ్ భూములను క్షేత్రస్థాయిలో భౌతికంగా పరిశీలించి, సేకరించిన వివరాలతో సమగ్ర నివేదిక రూపొందిస్తున్నట్లు విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గురువారం విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ప్రత్యేక కమిటీ విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. ఈ కమిటీలో జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు రెవెన్యూ, విజయవాడ నగరపాలక సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ, సీఐడీ, ఈ-ఆక్షన్స్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
లోటల్ ల్యాండ్‌మార్క్, పాయకాపురం, వాంబే కాలనీ ప్రాంతాల్లోని మూడు సర్వే నంబర్లకు సంబంధించిన అగ్రిగోల్డ్ భూములను కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో చైతన్య మాట్లాడుతూ, అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులపై ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కమిటీ ద్వారా ఇప్పటికే మూడు ఆస్తుల భౌతిక తనిఖీలు పూర్తయ్యాయని తెలిపారు.
ఈ తనిఖీల్లో సేకరించిన సమాచారం ఆధారంగా లిటిగేషన్ లేని భూముల వేలం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన రీసర్వే వివరాలు, ప్రభుత్వ విలువ, మార్కెట్ విలువ, మ్యుటేషన్ తదితర అంశాలతో కూడిన నివేదికలను సంబంధిత ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల అగ్రిగోల్డ్ ఆస్తుల నిర్వహణ, వేలం ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా సాగుతుందని పేర్కొన్నారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో జిల్లా రిజిస్ట్రార్ పీవీవీ దుర్గాప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.















Social Plugin