ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల: రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు, వి బి జి రామ్ జి గ్రామీణ ఉపాధి పథకం చట్టం, విత్తన చట్టం వంటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల కాపీలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ద్వారకాతిరుమ మండలం పంగిడిగూడెంలో భోగిమంటల్లో వేసి దహనం చేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును, కార్పొరేట్ కంపెనీల అనుకూల కేంద్ర విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, వి బి జి రామ్ జి గ్రామీణ ఉపాధి పథకం వద్దు.. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టమే ముద్దు అంటూ నినాదాలు చేశారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా అనేక చట్టాలు తీసుకువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విత్తన చట్టం రైతులకు వ్యతిరేకంగా ఉందన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి వి బి జి రామ్ జీ పేరుతో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి చట్టం చేయడం దారుణమని విమర్శించారు.
విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటికరించేందుకు కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు తీసుకువచ్చిందని రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ ప్రజలపై భారాల మోపే విధంగా కేంద్ర విద్యుత్ బిల్లు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రైతులు ఉచిత విద్యుత్ పథకాన్ని కోల్పోతారని చెప్పారు. రైతులకు ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు సంఘం మండల కార్యదర్శి గుర్రం రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మానుకొండ వీర్రాజు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోకపోతే భవిష్యత్తులో కూలీలు ఉపాధి గ్యారెంటీ కోల్పోతారని చెప్పారు. రైతు వ్యతిరేక, ప్రజావ్యతిరేక చట్టాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.















Social Plugin