దారి మళ్లించిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు డబ్బులు 20 కోట్ల రూపాయలు వెంటనే జమచేయాలి


ఏలూరు జిల్లా, ఏలూరు: తెలుగుదేశం ప్రభుత్వం పథకాల ప్రచారం పేరుతో దారి మళ్లించిన 20 కోట్ల రూపాయల  భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు డబ్బులు వెంటనే కార్మికుల కోసం వినియోగించాలని ఏ.పీ బిల్డింగ్ & ఆధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు డీఎన్వీడి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఓవర్ బ్రిడ్జి సెంటర్ నందు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. 


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కూటమి నాయకులు అధికారంలోకి వస్తే 100 రోజులలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునర్దిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీనీ పక్కనపెట్టి పథకాల ప్రచారం పేరుతో 20 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం దుర్మార్గమన్నారు. పథకం ప్రారంభించడానికి ముందుకు రాని కూటమి ప్రభుత్వ అధినేతలు కార్మికుల డబ్బులు స్వాహా చేయడానికి తప్పుడు పద్ధతుల అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఏ పథకాలు అమలు చేస్తున్నారని ప్రచారాలు చేస్తారని ప్రశ్నించారు. కార్మిక శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు కలిసి వందల కోట్ల రూపాయల భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను దారిమల్లిస్తున్నారని, అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని దీనిని బట్టి అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వ ఇచ్చిన 1214 మెమో రద్దుచేసి వెంటనే నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డును పునర్దించాలన్నారు. 

గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పెండింగ్ క్లైములు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక, నిర్మాణ మెటీరియల్ ధరలు పెరిగి పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇతర ప్రాంతాలకు వలసలు కూడా వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి ఎం.ఇసాక్, మాధవ, సత్యనారాయణ, కె.సంతోష్, పరస శ్రీనివాస్, నాగు, రామకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు.