ఏలూరు జిల్లా,చింతలపూడి,CRIME NEWS: అర్ధరాత్రి సమయంలో చింతలపూడి మండలం మేడిశెట్టివారి పాలెం గ్రామంలో పేకాట ఆడుతున్న శిబిరంపై చింతలపూడి ఎస్ఐ శ్రీ సతీష్ కుమార్ గారు తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.6,200 నగదును స్వాధీనం చేసుకున్నారు.
జంగారెడ్డిగూడెం ఏఎస్పీ శ్రీమతి సుస్మిత ఆర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చింతలపూడి మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చింతలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ క్రాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్ కుమార్ గారు, సిబ్బంది కలిసి ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా చింతలపూడి ఎస్ఐ సతీష్ కుమార్ గారు మండల ప్రజలకు కీలక హెచ్చరికలు చేశారు. చింతలపూడి మండల పరిధిలో పేకాట, కోడి పందాలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అలాగే మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాల నిర్మూలన కోసం ఇకపై డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టి నిఘాను మరింత పెంచుతామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు తప్పక సహకరించాలని కోరారు.
ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సమాచారం ఉంటే వెంటనే డయల్ 112 కు గానీ, లేదా నేరుగా చింతలపూడి ఎస్ఐ గారి ఫోన్ నంబర్ **9440796675** కు గానీ తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
అసాంఘిక కార్యకలాపాలు సమాజ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని, వాటి నిర్మూలనకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ కుమార్ గారు తెలిపారు.















Social Plugin