ఏలూరు జిల్లాలో టీడీపీని మరింత బలోపేతం చేస్తాం – జిల్లా అధ్యక్షులు బడేటి చంటి


ఏలూరు, డిసెంబర్ 24: ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా శాయశక్తులా కృషి చేస్తానని జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. క్యాడర్ ఎక్కడా దెబ్బతినకుండా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ ముఖ్య నాయకులందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయాలు కూటమి ఖాతాలో వేసి జిల్లా పార్టీ ప్రతిష్టను మరింత పెంచాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం శ్రమిస్తానని బడేటి చంటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నూతన జిల్లా అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు. భారీ గజమాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.

సమావేశంలో మాట్లాడిన బడేటి చంటి, జిల్లాలోని ప్రజాప్రతినిధులందరి మద్దతుతో తనను జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటానని, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. వైసీపీ నాయకుల ఉడత ఊపులకు భయపడవద్దని, సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా టీడీపీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు.

సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో విస్తృత ఆదరణ పొందాయని, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. కార్యకర్తలకు నిజమైన గౌరవం తెలుగుదేశం పార్టీలోనే లభిస్తుందని చెప్పారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభించేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నాయకుడు అందుబాటులో ఉంటే సమస్యలకు తావుండదని, వారంలో ఐదు రోజులపాటు పార్టీ కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. చింతలపూడి, పోలవరం, కైకలూరు నియోజకవర్గాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను సీనియర్ నాయకులతో కమిటీ వేసి పరిష్కరిస్తానని, అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానన్నారు.

రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులను నిలబెట్టి నూటికి నూరు శాతం విజయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి చంటి పిలుపునిచ్చారు.