ఆర్&ఆర్ ప్యాకేజీ అమలుపై సంతృప్తి వ్యక్తం చేసిన టీమ్ లీడర్ యోగేష్ పైతంకర్
ఏలూరు/పోలవరం, డిసెంబరు 24: పోలవరం మండలం కోండ్రుకోట గ్రామంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీని కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. కేంద్ర బృందం టీమ్ లీడర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎక్స్–అఫీషియో అదనపు కార్యదర్శి శ్రీ యోగేష్ పైతంకర్ ఈ పర్యటనకు నాయకత్వం వహించారు. కాలనీలోని పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, గ్రామ సచివాలయం, అదిసేవా కేంద్రాలను పరిశీలించి, అనంతరం నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా యోగేష్ పైతంకర్ మాట్లాడుతూ, కోండ్రుకోట నిర్వాసితుల కాలనీలో ఆర్&ఆర్ ప్యాకేజీ అమలు, ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించామని తెలిపారు. నిర్వాసితులను నేరుగా ప్రశ్నించి వారి అభిప్రాయాలను తెలుసుకోగా, అందుతున్న సౌకర్యాలపై వారు వ్యక్తం చేసిన సంతృప్తి ఆనందాన్ని కలిగించిందన్నారు.
పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, పిల్లలకు అందుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించామని తెలిపారు. చిన్నారుల బరువు, ఆరోగ్య స్థితిని స్వయంగా కాటా వేసి పరిశీలించామని, సేవలు సక్రమంగా కొనసాగుతున్నాయని అన్నారు. అలాగే గ్రామ సచివాలయంలో నిర్వాసితులకు అందుతున్న సేవలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నామని చెప్పారు.
ఈ పర్యటనలో కేంద్ర బృంద సభ్యులు యం. రఘు రామ్, సి.వి. సుబ్బయ్య, యం. రమేష్ కుమార్, కె. శంకర్, యం. రవి, శివ ప్రసాద్ పాల్గొన్నారు. వీరితో పాటు పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ & ఎక్స్–అఫీషియో జాయింట్ కలెక్టర్ వి. అభిషేక్, జిల్లా జాయింట్ కలెక్టర్ యం.జె. అభిషేక్ గౌడ, ఆర్డీవో యం.వి. రమణ, ఐటిడిఏ పీవో కె. రాములు నాయక్, డీఆర్‌డీఏ పీడీ ఆర్. విజయరాజు, డీపీఓ ఏ.వి. సుబ్బరాయన్, తహశీల్దారు బి. సాయిరాజు, ఎంపీడీవో పి. శ్రీనివాసబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గిరిజన నాయకులు, నిర్వాసిత కుటుంబాలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలను కేంద్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు.















Social Plugin