ప్రతి పౌరుడికి ఆరోగ్య సేవలపై అవగాహన అవసరం: న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాదు


ఏలూరు, డిసెంబరు 12: ప్రతి పౌరుడికి ఆరోగ్య సేవలపై పూర్తి అవగాహన కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాదు అన్నారు. ప్రపంచ ఆరోగ్య విస్తరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏలూరు లంబాడి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలపై స్పష్టమైన అవగాహన కలగడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని ఆరోగ్య పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయని, వాటికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ప్రజలకు తెలియజేశారు. ఎక్కువగా వ్యాధులు కలుషిత నీటి వల్ల వస్తాయన్న అంశాన్ని గుర్తు చేస్తూ, పరిశుభ్రమైన నీటిని మాత్రమే వినియోగించాలని సూచించారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచడం, స్వచ్ఛమైన నీటిని తాగడం, పోషకాహారం తీసుకోవడం ద్వారా అనారోగ్యాల నుంచి రక్షించుకోవచ్చని రత్నప్రసాదు పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం మరియు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఆరోగ్యంపై అప్రమత్తత అత్యంత అవసరమని తెలిపారు.

తదనంతరం, శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ హై స్కూల్‌లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి పరిశుభ్రత, ఆరోగ్యం అంశాలపై అవగాహన కల్పించడం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. ట్వింకిల్, డి.ఇ.ఎం.ఓ. బి. శ్రీనివాసరావు, ఎ.ఎం.ఓ. గోవిందరావు, ఎం.పి.హెచ్.ఎం. శ్రీనివాసరావు, హెడ్మాస్టర్ హరిబాబు, ప్యానల్ న్యాయవాది పుచ్చల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.