గతంలో ఒంగోలు డీఎస్పీగా విధులు నిర్వహించిన సమయంలో, కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కీలకమైన పోక్సో కేసును శ్రీ ప్రసాద్ గారు స్వయంగా పర్యవేక్షించారు. బాధితురాలికి న్యాయం చేకూర్చాలనే దృఢ సంకల్పంతో శాస్త్రీయ ఆధారాలు, పక్కా సాక్ష్యాలను సేకరించి, దర్యాప్తును అత్యంత సమర్థవంతంగా పూర్తి చేశారు.
ఈ క్రమంలో గౌరవ న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఇది పోలీస్ శాఖ దర్యాప్తు నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.
ప్రకాశం జిల్లా పోలీస్ వార్షిక నేర సమీక్షా సమావేశం సందర్భంగా, అప్పటి కేసు దర్యాప్తును గుర్తించిన అధికారులు ప్రసాద్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఆయనను శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
క్లిష్టమైన కేసులను ఛేదించడంలో, నిందితులకు శిక్ష పడేలా చేయడంలో డీఎస్పీ ప్రసాద్ చూపిన చొరవ ఇతర అధికారులకు ఆదర్శంగా నిలుస్తుందని ఎస్పీ కొనియాడారు. ఈ గౌరవంతో నూజివీడు సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది, ఏలూరు జిల్లా అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
“న్యాయం ఆలస్యం కావచ్చు కానీ, పకడ్బందీగా దర్యాప్తు చేస్తే నేరస్తులు తప్పించుకోలేరు” అన్న విషయాన్ని డీఎస్పీ ప్రసాద్ మరోసారి నిరూపించారని అధికారులు అభిప్రాయపడ్డారు.















Social Plugin