ఆగిరిపల్లి (వాహిని ప్రతినిధి): ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆగిరిపల్లి మండలంలోని పుణ్యక్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, వారి సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, ఆగిరిపల్లి ఎస్‌ఐ శుభ శేఖర్ పరిశీలించారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైందని అధికారులు తెలిపారు. నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనలతో, మండలంలోని వివిధ దేవాలయాల కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తోపులాటలు జరగకుండా పటిష్టమైన క్యూలైన్లు ఏర్పాటు చేయాలని దేవాలయ కమిటీలకు సూచించారు. అలాగే వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినన్ని నీడ సౌకర్యాలు, తాగునీటి వసతులు కల్పించాలని ఆదేశించారు.
అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఆలయ ప్రాంగణాల్లో నిరంతర నిఘా ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలీస్ శాఖ, దేవాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ గారు స్పష్టం చేశారు.
వేడుకల సమయంలో భక్తులు పోలీసులకు, దేవాలయ సిబ్బందికి సహకరించి క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలని అధికారులు కోరారు. నిబంధనలు అతిక్రమించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో ఆగిరిపల్లి పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.















Social Plugin