ఏలూరు / దెందులూరు: ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ జాతర సంబరాల్లో భాగంగా జాతర కమిటీ కన్వీనర్ వంకినేని భాను ప్రకాష్ ఇంటి వద్ద అమ్మవార్ల ఘటాలకు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవార్ల ఘటాలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, శతాబ్ద కాలానికి పైగా ఏలూరు పుర ప్రజలచే ఇలవేల్పుగా పూజలందుకుంటున్న తూర్పువీధి గంగానమ్మ జాతర 2025–26 కార్యక్రమాలను జాతర కమిటీ అత్యంత ఘనంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అమ్మవారు ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల ప్రజలను అనారోగ్యాలు, ఆపదల నుంచి కాపాడి సుఖశాంతులతో జీవించేలా దీవించాలని కోరుతూ శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబులకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
జాతర కమిటీ కన్వీనర్ వంకినేని భాను ప్రకాష్ ఇంటి వద్ద కొలువుదీరిన తూర్పువీధి శ్రీ గంగానమ్మ అమ్మవార్ల ఘటాలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో పాటు, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, తదితర ప్రజాప్రతినిధులు, దెందులూరు నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు పాల్గొని అమ్మవార్ల ఘటాలను దర్శించుకున్నారు.
అనంతరం జాతర కమిటీ కన్వీనర్ వంకినేని భాను ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొని అందరూ కలిసి సహపంక్తి భోజనాన్ని స్వీకరించారు. భక్తి, సంప్రదాయం, సామూహిక ఐక్యతకు ప్రతీకగా ఈ జాతర కార్యక్రమం నిలిచిందని పాల్గొన్న భక్తులు తెలిపారు.

















Social Plugin