ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ యాన్యువల్ మీట్ ఘన ముగింపు


ముఖ్య అతిథిగా ఏలూరు రేంజ్ ఐజీ జివిజి అశోక్ కుమార్ ఐపీఎస్


ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ యాన్యువల్ మీట్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు రేంజ్ గౌరవ ఐజీ జివిజి అశోక్ కుమార్ హాజరయ్యారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐజీ కి పుష్పగుచ్ఛం అందించి సాగరపూర్వకంగా స్వాగతం పలికారు.

ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ల పోలీస్ అధికారులు, ఆర్మ్డ్ రిజర్వ్ క్రీడాకారులు ఐజీ కి గౌరవ వందనం సమర్పించారు. ఐదు రోజుల పాటు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయ క్రీడా మైదానంలో ఈ పోటీలు ఉత్సాహంగా సాగాయి.

ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్ ఐపీఎస్ మాట్లాడుతూ, క్రీడల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. రానున్న స్పోర్ట్స్ మీట్స్‌లో మహిళా క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్. సూరిచంద్రరావు మాట్లాడుతూ, స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతంగా నిర్వహించిన పోలీస్ అధికారులను, క్రీడాకారులను అభినందించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిని ఎదుర్కోవాలంటే క్రీడా స్ఫూర్తి అవసరమని అన్నారు. గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం పెంపొందించాలని సూచించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో పోలీస్–ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో క్రీడలు కీలక పాత్ర పోషించాయని వివరించారు.

ముఖ్య అతిథి ఐజీ జివిజి అశోక్ కుమార్ మాట్లాడుతూ, నిరంతర పనిభారం మధ్య కూడా క్రీడా పోటీలను నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడక అలవాటు చేసుకోవాలని, కనీసం 5,000–6,000 అడుగులు నడవడం ఎంతో ఉపయోగకరమని సూచించారు. ఆరోగ్యవంతమైన పోలీస్ వ్యవస్థే సమాజానికి మెరుగైన సేవలు అందించగలదన్నారు.

ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ స్పోర్ట్స్ మీట్‌లో ఏలూరు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది ఓవరాల్ ఛాంపియన్‌గా నిలవగా, ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ 108 కిషోర్ వ్యక్తిగతంగా విశిష్ట ప్రతిభ కనబరిచారు.

కార్యక్రమంలో వివిధ సబ్ డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, ఫిజికల్ డైరెక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐజీ ఈ స్పోర్ట్స్ మీట్‌ను అధికారికంగా ముగిసినట్లు ప్రకటిస్తూ, వచ్చే ఏడాది మరింత ఉత్సాహంతో కలుద్దామని ఆకాంక్షించారు.